Tuesday 22 March 2011

ఆకుపచ్చ జ్ఞాపకం

ఇదేమిటీ చైత్రం చేసే చిత్రం
ప్రకృతమ్మ ఇంతగా
ఎలా మారిపోతుందో...
మావికొమ్మ కమ్మగా
పూల నవ్వు విసురుతుంది
వేప చిగురు
మయూరమై విరి నాట్యం చేస్తుంది...
కోయిలమ్మ తియ్యగా
గొంతెత్తి పా డుతుంది...

తెలుగు వాకిలి
ఒళ్ళంతా కళ్ళు చేసుకొని
తనువంతా ఆనందం నింపుకొని
ఎందుకిలా ఎదురుచూస్తోంది   
ఎందుకంటే...
మావిచిగురు
వేపపూత నేస్తం కట్టి
కొత్త రుచిని
కల్పించే కమనీయ కావ్యం ఇది
కొత్త బెల్లం
కొత్త చింతపందు
చింతలు తీర్చే
అరుదైన తరుణమిది
పొగరైన వగరుతో
ఉప్పైన  కడలితో
ఉప్పొంగే సంతోషం ఇది
ప్రకృతమ్మ పచ్చగా
నులివెచ్చగా
హృదయాలను తాకే   
ఆకుపచ్చ  జ్ఞాపకం ఇది...
ఇది ఉషస్సులను
యశస్సులను
నిర్మించే పునాది
తెలుగువారి తలపుల్లో
ఆనందపు నెలవది
యుగానికే ఆదిగా
సంతోషపు వారధిగా
పలకరించు ఉగాది...
అందుకే ప్రకృతమ్మ మోములో
నురగలెత్తు 
తరగలెత్తు
పరవశాల జల నిధి...


   
 

No comments:

Post a Comment