Saturday 26 March 2011

గురు భోగి

బోధించే గురువులెల్ల భోగిమంటలే
చలి చీకటి తరిమికొట్టు అగ్ని శిఖలే
విజ్ఞానపు వెచ్చదనం పంచే పరమాత్ములే
భొగాలను అంధించే మహాభోజులే

'మహి' మాన్విత మూర్తులు

జన్మనిచ్చిన ఆమ్మకు
పురుడు పోసిన నరుసమ్మకు
కాపిన ముసలమ్మకు
ఎత్తుకొని బుజ్జగించిన ఆయమ్మకు
బాలసారె చేసిన అమ్మమ్మకు
తొలి అన్నం ముద్ద పెట్టిన నాయనమ్మకు
జీవితాన్ని దిద్దిన గురువమ్మకు
తొలి గిలిగింతలు పెట్టిన గృహిణమ్మకు 
ఇలా బతుకు పొడవునా ఎదురైన
ఎందరో మహికే పుట్టిన
మహిమాన్విత మూర్తులు మహిళలు
అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ...

Tuesday 22 March 2011

కూలిన "వెలుగు"

తెలుగు వెలుగుల కోసం
వెలుగుల తెలుగు జాతి కోసం
మీరు మీ జీవితాలనే ధార పోశారు
మేము  మాత్రం మిమ్మల్ని రోడ్డుకు లాగాం
ఉద్వేగాలతో మీ మహత్తుని విస్మరించి
మీకు ప్రాంతీయ రంగుల్ని పులిమి
కసితీరా మిమ్మల్ని కూలగొట్టాం
హుస్సెన్ సాగర్ లో నిమజ్జనం చేశాం
మా వికృత దాహాన్ని తీర్చుకున్నాం
తెలుగు జాతి గౌరవాన్ని
రౌరవాది నరకాల్లోకి విసిరేసాం
ఎవరు గాయపడినా మాకు లెక్క లేదు
మా ఉద్వేగాలు చల్లారితే... 
మా ఉద్దేశాలు నెరవేరితే
మాకు చాలు...

ఆకుపచ్చ జ్ఞాపకం

ఇదేమిటీ చైత్రం చేసే చిత్రం
ప్రకృతమ్మ ఇంతగా
ఎలా మారిపోతుందో...
మావికొమ్మ కమ్మగా
పూల నవ్వు విసురుతుంది
వేప చిగురు
మయూరమై విరి నాట్యం చేస్తుంది...
కోయిలమ్మ తియ్యగా
గొంతెత్తి పా డుతుంది...

తెలుగు వాకిలి
ఒళ్ళంతా కళ్ళు చేసుకొని
తనువంతా ఆనందం నింపుకొని
ఎందుకిలా ఎదురుచూస్తోంది   
ఎందుకంటే...
మావిచిగురు
వేపపూత నేస్తం కట్టి
కొత్త రుచిని
కల్పించే కమనీయ కావ్యం ఇది
కొత్త బెల్లం
కొత్త చింతపందు
చింతలు తీర్చే
అరుదైన తరుణమిది
పొగరైన వగరుతో
ఉప్పైన  కడలితో
ఉప్పొంగే సంతోషం ఇది
ప్రకృతమ్మ పచ్చగా
నులివెచ్చగా
హృదయాలను తాకే   
ఆకుపచ్చ  జ్ఞాపకం ఇది...
ఇది ఉషస్సులను
యశస్సులను
నిర్మించే పునాది
తెలుగువారి తలపుల్లో
ఆనందపు నెలవది
యుగానికే ఆదిగా
సంతోషపు వారధిగా
పలకరించు ఉగాది...
అందుకే ప్రకృతమ్మ మోములో
నురగలెత్తు 
తరగలెత్తు
పరవశాల జల నిధి...


   
 

Friday 18 March 2011

చిన్ని రాతలు

''అణు"వణువూ
విలయమే
సందేశం
జపాన్ తీరమే

నీతి లేని
రాతలు
నీటి  మీది గీతలు

ముద్దుకూ
ముద్దకూ
చుట్టుకొలత
విశాల విశ్వమంత

Monday 14 March 2011

సమైక్యతకు ప్రాణమా...

పొడుస్తున్న పొద్దు మీద
విడుస్తున్న ఉదయమా
ఓ తెలంగాణమా..
ఓ తెలంగాణమా...సమైక్యతకు ప్రాణమా...

నడుస్తున్న నావ మీద
విసుర్తున్న కెరటమా
ఓ తెలంగాణమా..
ఓ తెలంగాణమా...సమైక్యతకు ప్రాణమా...

విరుస్తున్న నింగి మీద
ముసురుకున్న మేఘమా
ఓ తెలంగాణమా..
ఓ తెలంగాణమా...సమైక్యతకు ప్రాణమా...

విచ్చుకున్న ఆమని పై
విరిగిపడ్డ శిశిరమా
ఓ తెలంగాణమా..
ఓ తెలంగాణమా...సమైక్యతకు ప్రాణమా...

ఆకుపచ్చ కోనలోన
చిచ్చుమిసిన జ్వలనమా
ఓ తెలంగాణమా..
ఓ తెలంగాణమా...సమైక్యతకు ప్రాణమా...

గుట్టు నడక దారిలోన
గుచ్చుకున్న శూలమా
ఓ తెలంగాణమా..
ఓ తెలంగాణమా...సమైక్యతకు ప్రాణమా...

విరబూసిన పెదవిపైన
విరజిమ్మిన రక్తమా
ఓ తెలంగాణమా..
ఓ తెలంగాణమా...సమైక్యతకు ప్రాణమా...

కదులుతున్న కడలిపైన
కరిగిన సుడిగుండమా
ఓ తెలంగాణమా..
ఓ తెలంగాణమా...సమైక్యతకు ప్రాణమా...

 రాజకీయ రాట్నమందు
దారమైన భారమా
ఓ తెలంగాణమా..
ఓ తెలంగాణమా...సమైక్యతకు ప్రాణమా...

ఓట్ల కొరకు పాట్లు పడే
నేతల ఫలహారమా
ఓ తెలంగాణమా..
ఓ తెలంగాణమా...సమైక్యతకు ప్రాణమా...

కుళ్ళు పెత్తనాల పైన
గుల్లయైన దేహమా
ఓ తెలంగాణమా..
ఓ తెలంగాణమా...సమైక్యతకు ప్రాణమా...

దొరబాబుల మోముపైన
పగిలిన పరిహాసమా
ఓ తెలంగాణమా..
ఓ తెలంగాణమా...సమైక్యతకు ప్రాణమా...

విధ్వంసపు యజ్ఞంలో
ఆవిరైన సమిధమా
ఓ తెలంగాణమా..
ఓ తెలంగాణమా...సమైక్యతకు ప్రాణమా...

పేగు బంధమొదలమన్న
రక్త సంబంధమా
ఓ తెలంగాణమా..
ఓ తెలంగాణమా...సమైక్యతకు ప్రాణమా...

(అమాయక తెలంగాణ ప్రజల్ని ఉద్యమం పేరుతో మభ్య పెడుతున్ననేతల తీరుకు వేదనగా...నిరసనగా...ప్రజాగాయకుడి 'పొడుస్తున్నపొద్దు 'కు అనుసరణగా...)




Friday 11 March 2011

బండబారిన టాంకుబండ్

మహాబోధి సాక్షిగా
హుస్సేన్ సాగర్ సాక్షిగా
మహనీయులు నేలకొరిగారు
మూర్తులను నేలరాల్చి
మూర్ఖులు అలసిపోయారు
ఇది చూసి తెలుగునేల గుండెలు అవిసి పోయాయి 
అన్నిటికీ   మూగసాక్షిగా
మిగిలిన టాంక్ బండ్ 
గుండె బండబారిపోయి  
గాయాలు తడుముకొంటూ నిల్చిపోయింది 

మైక్రోభూతం

కూలి రెక్కలు కూల్చిన
మైక్రో భూతం
నోట్లు దిగమింగి
నిద్రపోతోంది
అచ్చం ప్రభుత్వం లానే...

ఒంటరి

గువ్వకు రెక్కలు వచ్చాయి
ఒంటరయ్యింది గూడు
బిడ్డకు రెక్కలు వచ్చాయి
ఒంటరయ్యింది గుండె

చిట్టి రాతలు

పుస్తకం నిండా 
జ్ఞాపకాల మేఘాలే
పుస్తకం మూసేస్తే
కళ్ళ నిండా వర్షాలే

రాముడు రావణుడు
ఎవరు అయినా ఒకటే
సీత కళ్ళల్లో కన్నీరే

ఆల్మట్టికి
రెండు వైపులా నీరే
ఓ వైపు కన్నీరు
మరో వైపు పన్నీరు

కాలుతోంది
తెలుగు పూల తోట
తమిళ కర్నాట
కన్నుల పంటగా

గురు మహా శివరాత్రి

విద్య నేర్పు ఒజ్జలెల్ల మహాదేవులే
అక్షరాల భిక్షనొసగు ఆదిభిక్షులే
అజ్ఞానం అంతు తేల్చు మహారుద్రులే
అరమరికలు లేనియట్టి భోళాశంకరులే

ఎందరో గురు మహాశివులు ...
అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు

రైతు బతుకు

"రైతు బతుకు బాటలో
మెతుకు వెతుకులాటలో
కష్టాలే పెట్టుబడి
కన్నీళ్ళే దిగుబడి

రుతుపవనాలు వచ్చాయి
కాలవలో నీళ్ళు
రైతు గుండెలో
పరవళ్ళు

అల్ప పీడనం
వాయుగుండం
చేలలోనూ
రైతు కళ్ళలోనూ
నీళ్ళే నీళ్ళు

అందరికీ నమస్కారం

ఇది నా జాల పత్రిక...నా మానస పుత్రిక...దీన్ని అందరు చూసి మీ అభిమానాన్ని కురిపించాలని కోరుతూ...